రవికిషన్ మాటల్లో తప్పేముంది?: జయాబచ్చన్ వ్యాఖ్యలపై జయప్రద ఫైర్

  • నటుడు, ఎంపీ రవికిషన్ వ్యాఖ్యలను ఖండించిన జయాబచ్చన్
  • జయాబచ్చన్ వ్యాఖ్యలపై రెండుగా చీలిపోయిన పరిశ్రమ
  • రవికిషన్ వ్యాఖ్యలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు తగవన్న జయప్రద
రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌పై సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద తీవ్ర విమర్శలు చేశారు. నటుడు, ఎంపీ రవికిషన్ ఇటీవల మాట్లాడుతూ సినీ పరిశ్రమకు చెందినవారు కూడా మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అయితే, రవికిషన్ వ్యాఖ్యలను ఖండించిన జయాబచ్చన్ ఏ కొద్దిమందో చేసిన తప్పులకు మొత్తం పరిశ్రమను నిందించవద్దని హితవు పలికారు. నటుడైన ఓ ఎంపీ పరిశ్రమకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం బాధాకరమైన విషయమని అన్నారు. జయాబచ్చన్ వ్యాఖ్యలపై పరిశ్రమ రెండుగా చీలిపోయింది. కొందరు ఆమెకు మద్దతు పలకగా, మరికొందరు వ్యతిరేకించారు.

తాజాగా, జయప్రద స్పందించారు. రవికిషన్ వ్యాఖ్యలను అడ్డంపెట్టుకుని జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మాదకద్రవ్యాలకు బానిసైన యువతను కాపాడేందుకు రవికిషన్ ప్రయత్నిస్తున్నారని, ఆయనకు తాను మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఈ అంశాన్ని అడ్డంపెట్టుకుని జయాబచ్చన్ రాజకీయాలు చేయడం తగదని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మనమంతా పోరాడాలని, యువతను కాపాడాలని జయప్రద పిలుపునిచ్చారు.


More Telugu News