మా వ్యాక్సిన్ తో ఆ దుష్ప్రభావాలు ఊహించినవే.. ఫర్వాలేదంటోన్న రష్యా ఆరోగ్య శాఖా మంత్రి

  • ఇటీవల 300 మందికి వ్యాక్సిన్‌
  • వారిలో 14 శాతం మందికి జ్వరం, ఒంటినొప్పులు
  • ప్రకటించిన రష్యా ఆరోగ్య శాఖ మంత్రి
  • సాధారణమేనని వ్యాఖ్య
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్ తీసుకురావడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నాలు కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వీపై అందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే, దాని వల్ల స్వల్ప దుష్ప్రభావాలు తలెత్తాయని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న 300 మంది వాలంటీర్లలో 14 శాతం మంది వాలంటీర్లకు ఒళ్లు నొప్పులు, నీరసం, జ్వరం వంటి సమస్యలు వచ్చాయని చెప్పారు. అయితే, ఈ సైడ్ ఎఫెక్స్‌ తాము ఊహించినవేనని ఆయన అన్నారు. అవి సాధారణంగా ఒకటిన్నర రోజుల్లో పోతాయని తెలిపారు.

కాగా, తమ వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రపంచ వ్యాప్తంగా త్వరలో ప్రారంభమవుతాయని రష్యా ఇటీవలే తెలిపింది. దాదాపు 40 వేల మందికి టీకా ఇస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలో రష్యా ఇటీవల 300 మంది వాలంటీర్లకు వ్యాక్సిన్‌ మొదటి డోసు వేశారు. త్వరలోనే వారికి రెండో‌ డోసును వేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం ఓ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ యాప్‌ ద్వారా తెలియజేయాలని చెప్పారు.

కాగా, రష్యా సరైన పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్‌ను తీసుకొస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మొదటి రెండు ట్రయల్స్ ‌ఫలితాలు బాగున్నాయని మెడికల్ జర్నల్ ల్యాన్సెట్ ప్రచురించడంతో ఈ వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగింది.


More Telugu News