అసోంలో భయపెడుతున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ .. 12 వేల పందులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశం

  • 14 జిల్లాల్లో వ్యాప్తి చెందిన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ
  • ఇప్పటి వరకు 18 వేలకుపైగా వరాహాల మృత్యువాత
  • పందుల యజమానులకు పరిహారం
అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ప్రమాదకర ఈ ఫ్లూ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 జిల్లాల్లో 18 వేలకు పైగా పందులు మృత్యువాత పడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లోని 12 వేల వరాహాలను చంపేయాలని ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ ప్రభుత్వం నిన్న అధికారులను ఆదేశించింది. అదే సమయంలో వాటి యజమానులకు పరిహారం అందించాలన్నారు.

అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా, నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పందులను వధించాలని, దుర్గాపూజ (దసరా)కు ముందే ఈ పని పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 14 జిల్లాల్లోని 30 ఎపిసెంటర్లలో కిలోమీటర్ పరిధిలో వరాహాలను వధించనున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే డ్రైవ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. పరిహారాన్ని వాటి యజమానుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపారు.


More Telugu News