కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యాక అస్వస్థత.. బీజేడీ ఎమ్మెల్యే కన్నుమూత

  • గత నెల 14న కొవిడ్ బారినపడిన ఎమ్మెల్యే
  • పిపిలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
  • వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి
కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒడిశా ఎమ్మెల్యే ప్రదీప్ మహారథి (65) తిరిగి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. బిజూ జనతాదళ్‌(బీజేడీ)కు చెందిన ప్రదీప్ పూరి జిల్లాలోని పిపిలి నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత నెల 14న కొవిడ్ బారినపడిన ఎమ్మెల్యే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. కోలుకోవడంతో ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. అయితే, రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో మళ్లీ ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి మరింత దిగజారడంతో వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో నిన్న ప్రాణాలు విడిచారు.

1985లో తొలిసారి జనతాదళ్‌లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రదీప్ మహారథి ఇప్పటి వరకు ఏడుసార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2000వ సంవత్సరంలో నవీన్ పట్నాయక్ సారథ్యంలో ఏర్పాటైన బిజు జనతాదళ్‌లో చేరారు. కరోనా మహమ్మారి కట్టడికి విశేషంగా కృషి చేసిన ఆయన, చివరికి దాని బారినే పడి మృతి చెందడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ప్రదీప్ మృతికి గవర్నర్ గణేషిలాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు సంతాపం తెలిపారు.


More Telugu News