అంత హడావుడిగా లేఖలు రాయకపోతే ఏమవుతుంది?: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

  • చంద్రబాబు లేఖలనిండా అవాస్తవాలేనని వ్యాఖ్యలు
  • వాస్తవాలు సరిచూసుకోవాలని హితవు
  • చంద్రబాబుకు అధికారం తప్ప మరో ఆలోచన లేదన్న సజ్జల
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల రాష్ట్రంలో ఏంజరిగినా చంద్రబాబు నేరుగా డీజీపీకి, సీఎస్ కు లేఖలు రాస్తున్నారని, చంద్రబాబు వాస్తవాలు రాస్తే బాగుంటుందని అన్నారు. చంద్రబాబు రాసే లేఖల నిండా అవాస్తవాలేనని విమర్శించారు. చిన్న ఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారని తెలిపారు. డీజీపీకే ఎందుకు లేఖలు రాస్తున్నారని సజ్జల ప్రశ్నించారు.

దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలియవని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ టీడీపీ విఫలమైందని వ్యాఖ్యానించారు. "చంద్రబాబు లేఖలు రాసే ముందు గణాంకాలు సరిచూసుకోవాలి. అయినా రెండ్రోజులు ఆగి వాస్తవాలను పరిశీలించి లేఖలు రాయొచ్చు. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకిలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు? ఆయనది పెద్ద వయసు అనుకుంటే, ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లు ఏంచేస్తున్నారు?

 అయినా ఇది టీడీపీ పాలన కాదు. ఎన్ని కేసులు పెడితే అన్ని కేసుల్లో నిందితులను అరెస్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఏం జరిగినా వైసీపీకే ముడిపెడుతున్నారు. ఆర్నెల్లపాటు హైదరాబాదులో గడిపిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇప్పుడొచ్చి, కరోనాపై తమకు సమాచారం అందించాలంటూ ఓ వెబ్ సైట్ ఓపెన్ చేశారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఓ విదూషకుడిలా అనిపిస్తున్నారు. ప్రపంచమంతా ఏపీ కరోనా నియంత్రణ చర్యలను ప్రశంసిస్తుంటే, ఆయనకు ఇవేవీ కనిపించడంలేదు. చంద్రబాబుకు అధికారం తప్ప మరో ఆలోచన ఉండదు " అంటూ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News