ట్రిపుల్ తలాక్ రద్దు కోసం పోరుసలిపిన ముస్లిం మహిళ .. బీజేపీలో చేరిన 10 రోజుల్లోనే పదవి!

  • ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన షాయరా
  • ఆమెతోపాటు మరో ఇద్దరు మహిళా కమిషన్ ఉపాధ్యక్షులుగా నియామకం 
  • ఇక సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్న సీఎం
ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలంటూ పోరాడి ఆ తర్వాత బీజేపీలో చేరిన ఉత్తరాఖండ్‌కు చెందిన షాయరా బానో‌కు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో ప్రధాన పిటిషన్‌దారు షాయరానే.

ఉద్ధంసింగ్ నగర్‌కు చెందిన షాయరాకు భర్త స్పీడ్ పోస్టు ద్వారా 2014లో ముమ్మారు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చారు. ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత తక్షణ ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా షాయరా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2019లో ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది.

ఇటీవలే ఆమె బీజేపీలో చేరగా, చేరిన పది రోజుల్లోనే ఆమెకు ఈ పదవి దక్కడం గమనార్హం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం షాయరా బానో, జ్యోతి షా, పుష్ప పాశ్వాన్‌లను రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది సహాయమంత్రి హోదా కలిగిలిన పదవి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మాట్లాడుతూ.. మహిళా సమస్యలను మరింత సమర్థవంతంగా పరిష్కరించేందుకు, అపరిష్కృత సమస్యల పరిష్కారానికి వీరి నియామకాలు ఎంతగానో దోహద పడతాయన్నారు.


More Telugu News