ఉప ఎన్నికలో మీ ఓట్ల ద్వారా బీజేపీకి బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

  • దుబ్బాక నియోజకవర్గంలో జోరుగా హరీశ్ రావు ప్రచారం
  • బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించిన వైనం
  • వ్యవసాయ బావుల వద్ద మీటర్లు బిగిస్తారంటూ వ్యాఖ్యలు
  • బీజేపీని 300 మీటర్ల లోతున పాతేయాలంటూ పిలుపు
తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత తరఫున అన్నీతానై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తన ప్రసంగాల ద్వారా బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటివరకు వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు తీసుకురావడం తప్ప తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

ఎవరికి ఓటేస్తారు..? వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే బీజేపీకి ఓటేస్తారా? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు బిగిస్తున్న బీజేపీని 300 మీటర్ల లోతున పాతేయాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ కుటిలయత్నాలకు ప్రజలు తమ ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని అన్నారు.

బీజేపీని గెలిపిస్తే మీటర్లు, ఇతర రైతు వ్యతిరేక విధానాలు కొనసాగిస్తారని వ్యాఖ్యానించారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలు తెలివైన వారని, సంక్షేమ పథకాలు కావాలో, రైతు వ్యతిరేక విధానాలు కావాలో నిర్ణయించుకోవాలని తెలిపారు.


More Telugu News