ఊర్మిళ, ఆమె తల్లి తీరును ఖండిస్తూ లేఖ విడుదల చేసిన మాన్సాస్ ట్రస్టు కార్యాలయం

  • పూసపాటి వారసుల మధ్య మరోసారి మాటలయుద్ధం
  • సిరిమానోత్సవంలో తమను అవమానించారన్న ఊర్మిళ
  • ఊర్మిళ, సుధా గజపతి అహంకారపూరితంగా ప్రవర్తించారన్న మాన్సాస్
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా పూసపాటి రాజ కుటుంబీకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మాన్సాస్ ట్రస్టు చైర్మన్ సంచయిత తమను అవమానించిందని ఆనంద గజపతిరాజు మరో కుమార్తె ఊర్మిళ, ఆమె తల్లి సుధా గజపతిరాజు నిన్న తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ కార్యాలయం స్పందించింది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఓ లేఖ విడుదల చేసింది.

సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై మాన్సాస్ ట్రస్టు అధినేతలకు ముందు వరుసలో సీట్లు కేటాయించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ అని లేఖలో స్పష్టం చేశారు. అయితే, కొందరు ఎలాంటి అనుమతి లేకపోయినా, నేరుగా వచ్చి ముందు వరుసలో మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ కోసం కేటాయించిన కుర్చీల్లో కూర్చున్నారని తెలిపారు. ఊర్మిళ, సుధా గజపతిరాజు ఆలయ ఈవో పక్కనే కూర్చుని సిరిమానోత్సవం తిలకించారని, అయినప్పటికీ తమకు సీట్లు కేటాయించకుండా అవమానించారని మీడియాకు చెప్పడం విచారకరం అని ఆ లేఖలో అభిప్రాయపడ్డారు.

"వారు తమను తాము మహారాణి, రాజకుమార్తెలా గౌరవించాలని కోరుకుంటున్నారు. కానీ సిరిమానోత్సవం ప్రజల ఉత్సవం. ప్రస్తుతం నడుస్తున్నది ప్రజాసామ్యకాలం. అయినప్పటికీ కొందరు రాచరికాన్ని కోరుకోవడం దురదృష్టకరం. ఈ ఘటనలో ఊర్మిళ, ఆమె తల్లి ప్రవర్తించిన తీరు అహంకారపూరితంగా ఉంది" అంటూ ఆ లేఖలో విమర్శించారు.


More Telugu News