సంచయిత రికార్డుల్లో తండ్రి పేరు రమేశ్ శర్మ అని ఉంది: రఘురామకృష్ణరాజు

  • ఆనందగజపతిరాజుతో విడాకులు తీసుకున్నాక ఉమ ఢిల్లీకి వెళ్లారు
  • అక్కడ రమేశ్ శర్మను రెండో వివాహం చేసుకున్నారు
  • తండ్రి చనిపోయినా చూసేందుకు సంచయిత రాలేదు
మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత గజపతిరాజుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనందగజపతిరాజుతో విడాకులు తీసుకున్న తర్వాత సంచయిత తల్లి ఉమ ఢిల్లీకి వెళ్లిపోయారని చెప్పారు. ఆ తర్వాత రమేశ్ శర్మ అనే వ్యక్తిని ఉమ పెళ్లి చేసుకున్నారని తెలిపారు. 2013లో సంచయిత ఒక ఆర్టికల్ రాశారని... అందులోని విషయాలు ఈ అంశాలను ధ్రువీకరిస్తున్నాయని చెప్పారు. సంచయిత స్కూల్ రికార్డుల్లో కూడా తండ్రి పేరు రమేశ్ శర్మ అని ఉందని తెలిపారు.

తల్లిదండ్రులిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత... ఆనందగజపతిరాజు చనిపోయినా సంచయిత చూడ్డానికి రాలేదని రఘురాజు అన్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆనందగజపతిరాజు సుధారాజును రెండో వివాహం చేసుకున్నారని చెప్పారు. సుధకు పుట్టిన ఊర్మిళనే తన వారసురాలిగా ప్రకటిస్తూ ఆనంద్ వీలునామాలో పేర్కొన్నారని అన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చి, గజపతి వంశంలో చిచ్చుపెట్టడం సంచయితకు సరికాదని రఘురాజు అన్నారు. ఊర్మిళ మీడియాతో మాట్లాడటాన్ని తాను చూశానని... చాలా చక్కగా మాట్లాడిందని కితాబునిచ్చారు. సంచయిత అంశంలో కోర్టుకు వెళ్తున్నట్టు ఊర్మిళ చెప్పారని అన్నారు. విజయనగరం సిరిమానోత్సవంలో సొంత కుటుంబాన్ని అవమానించే కుసంస్కారం రాజవంశీకులకు ఉండదని అన్నారు.

ఎవరి అండ చూసుకునో సంచయిత చెలరేగిపోతే... రానున్న రోజుల్లో కోర్టు నోటీసులు అందుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 'అమ్మా సంచయితా, నిన్ను అడ్డు పెట్టుకుని మాన్సాస్ ఆస్తులను కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు' అంటూ ఆయన హెచ్చరించారు. వారి ట్రాప్ లో పడకుండా ఆస్తులు రక్షించుకోండని సూచించారు.


More Telugu News