పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతం... నిర్దేశిత కక్ష్యల్లో చేరిన 10 ఉపగ్రహాలు
- వర్షం కారణంగా ప్రయోగం ఆలస్యం
- మధ్యాహ్నం 3.12 గంటలకు నింగికెగిసిన రాకెట్
- అన్ని దశలు విజయవంతంగా పూర్తి
భూ పరిశీలన, వాతావరణ శాటిలైట్ ఈఓఎస్-01 తో పాటు 9 వాణిజ్య ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ తన పనిని విజయవంతంగా పూర్తి చేసింది. ఈఓఎస్-01 సహా అన్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. రాకెట్ నుంచి విడవడిన అన్ని ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశించాయి. మొదటిగా, పీఎస్ఎల్వీ సీ-49 నాలుగో దశలో ఈఓఎస్-01 విజయవంతంగా విడిపోయింది. ఆ తర్వాత మిగిలిన 9 ఉపగ్రహాలను వాటి కక్ష్యలో చేర్చడంతో మిషన్ పూర్తయింది.
అంతకుముందు, శ్రీహరికోటలో వర్షం పడడంతో 3.02 గంటలకు బదులు 3.12 గంటలకు పీఎస్ఎల్వీ సీ-49 నింగిలోకి దూసుకెళ్లింది. మెరుపులు రాకెట్ లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయన్న నేపథ్యంలో 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ప్రయోగం ఆలస్యం అయినా మిషన్ యావత్తు ఏమాత్రం లోపాలు లేకుండా సజావుగా సాగింది. రాకెట్ నింగికి ఎగిసిన తర్వాత ప్రతి అంకాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో జాగరూకతతో పర్యవేక్షించారు. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇస్రో చేపట్టిన మొట్టమొదటి రాకెట్ ప్రయోగం ఇది.