కరోనా కష్టకాలంలోనూ అనుకున్నది సాధించారు: ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోదీ ప్రశంసలు

  • పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం
  • శుభాభినందనలు తెలిపిన మోదీ
  • సుదీర్ఘ విరామం తర్వాత శ్రీహరికోట నుంచి ప్రయోగం
పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ కు చెందిన ఈఓఎస్-01 ఉపగ్రహంతో పాటు మరో 9 విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ఆ ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, పీఎస్ఎల్వీ సీ-49/ఈఓఎస్-01 మిషన్ విజయవంతం అయినందుకు ఇస్రోను, భారత అంతరిక్ష రంగాన్ని అభినందిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ మన శాస్త్రవేత్తలు అనేక అడ్డంకులు అధిగమించి, అనుకున్నది సాధించారని కొనియాడారు. ఈ మిషన్ లో భాగంగా 4 అమెరికా ఉపగ్రహాలు, 4 లక్సెంబర్గ్ ఉపగ్రహాలు, ఒక లిథువేనియా ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగిందని మోదీ వివరించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఈ మధ్యాహ్నం పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


More Telugu News