అధిష్ఠానంతో ఎమ్మెల్యేలకు గ్యాప్ లేదు: గుడివాడ అమర్నాథ్

  • అధిష్ఠానానికి, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ లేదు
  • నా వ్యాఖ్యలను వక్రీకరించి రాశారు
  • జగన్ నుంచి మాకు పిలుపే రాలేదు
విశాఖ జిల్లా వైసీపీలో వివాదం చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ మధ్య వివాదం తలెత్తింది. మీడియా ముఖంగా ఎమ్మెల్యేలు తమ అసహనాన్ని ప్రదర్శించారు. ఈ అంశం ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్లడంతో... అందరినీ పిలిపించి ఆయన క్లాస్ పీకినట్టు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం విశాఖలో ఆ జిల్లాకు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో విజయసాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.

పార్టీ అధిష్ఠానానికి, ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అమర్నాథ్ చెప్పారు. అనకాపల్లిలో 'నాడు నేడు' కార్యక్రమం సక్రమంగా జరగాలనే తాను అన్నానని... తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. జగన్ నుంచి తమకు అసలు పిలుపే రాలేదని.. తాము అమరావతికి వెళ్లనే లేదని... ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వార్తలు రాశారని చెప్పారు. తాము అమరావతికి ఎప్పుడు వెళ్లేమో మీరే చెప్పండి? అంటూ మీడియాను ప్రశ్నించారు.


More Telugu News