టిక్‌టాక్ ప్రియులకు శుభవార్త.. భారత్‌లో ప్రవేశానికి కసరత్తు షురూ!

  • మొన్న ‘పబ్‌జీ మొబైల్’, నేడు ‘టిక్‌టాక్’
  • ఉద్యోగులకు లేఖ రాసిన టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ
  • యూజర్లు, క్రియేటర్లకు తిరిగి అంకితమవుదామన్న గాంధీ
దేశంలోని టిక్‌టాక్ ప్రియులకు ఇది శుభవార్తే. నిషేధానికి గురైన ఈ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ మళ్లీ భారత్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ సంస్థ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఉద్యోగులకు రాసిన లేఖతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చైనా బైట్‌డ్యాన్స్‌‌కు చెందిన టిక్‌టాక్ భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని, దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత వంటి వాటి విషయంలో ప్రమాదకరంగా మారిందంటూ జూన్‌లో దీనిపై కేంద్రం నిషేధం విధించింది.

అప్పటి నుంచి భారత వినియోగదారులకు దూరమైన ఈ యాప్ తిరిగి దేశంలో కాలుమోపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. భారత చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ, గోప్యత, భద్రత పరమైన చర్యలు చేపట్టింది. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ భారత ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. ప్రభుత్వం ఇంకేమైనా సమస్యలు లేవనెత్తినా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.

ఉద్యోగులకు రాసిన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించిన గాంధీ.. భారత్‌లో తిరిగి అడుగుపెట్టేందుకు ఇది సానుకూల అంశమని అన్నారు. ఉద్యోగులతో కలిసి తిరిగి వినియోగదారులు, క్రియేటర్లకు అంకితమవుతామని వివరించారు. కాగా, దేశం నుంచి నిషేధానికి గురైన ‘పబ్‌జీ మొబైల్’ గేమ్ కూడా తిరిగి భారత్‌లో ప్రవేశానికి సిద్ధమైంది. తాము మళ్లీ వచ్చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించింది. ఆ వెంటనే టిక్‌టాక్ కూడా  భారత్‌లో ప్రవేశానికి కసరత్తు ప్రారంభించడం గమనార్హం.


More Telugu News