అంతుచిక్కని వ్యాధి గురించి జగన్ కు ఫోన్ చేసిన గవర్నర్

  • కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సూచన
  • 263 మంది కోలుకున్నారని గవర్నర్ కు తెలిపిన సీఎం
  • బాధితులకు పూర్తి స్థాయిలో చికత్స అందిస్తున్నామన్న జగన్
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ప్రజలు అంతుచిక్కని వ్యాధికి గురవుతుండటం అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఫోన్ చేశారు. వ్యాధి గురించి, బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర సంస్థల సహకారాన్ని తీసుకోవాలని సీఎంకు సూచించారు. వ్యాధి బారిన పడిన వారికి పూర్తి సహాయసహకారాలను అందించాలని చెప్పారు.

మరోవైపు ఇప్పటి వరకు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని గవర్నర్ కు సీఎం తెలియజేశారు. ఇప్పటి వరకు మొత్తం 467 మంది ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారని, వీరిలో 263 మంది కోలుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సాయం అందించిందని తెలిపారు. తీవ్ర లక్షణాలతో బాధపడుతున్న వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

సీసీఎంబీ, ఎయిమ్స్, జాతీయ పోషకాహార సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలు ఈ వింత వ్యాధిపై అధ్యయనం చేస్తున్నాయని జగన్ తెలిపారు. బాధితుల బ్లడ్ తో పాటు ఇతర శాంపిల్స్ ను కలెక్ట్ చేసి పరీక్షలు చేస్తున్నారని చెప్పారు.


More Telugu News