బీజేపీకి కేటాయించిన కమలం గుర్తును ఉపసంహరించుకోవాలంటూ పిల్

  • గుర్తులను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయండి
  • కమలం గుర్తుతో ఆ పార్టీకి అయాచిత లబ్ధి
  • స్వతంత్ర అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందన్న పిటిషనర్
  • వచ్చే నెల 12కు విచారణను వాయిదా వేసిన ధర్మాసనం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఎన్నికల గుర్తుగా కేటాయించిన కమలం గుర్తును వెనక్కి తీసుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన కాళీ శంకర్ గతంలో ఇదే విషయమై ఈసీని అభ్యర్థించారు. బీజేపీకి కేటాయించిన కమలం గుర్తు జాతీయ పుష్పమని, ప్రభుత్వ వెబ్‌సైట్లలోనూ ఇది కనిపిస్తుందని, కాబట్టి ఈ గుర్తును వాడేందుకు ఏ పార్టీకి అనుమతి ఇవ్వొద్దని కోరారు. ఈ గుర్తు కలిగిన పార్టీకి అయాచిత లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు. అయితే, ఆయన విజ్ఞప్తిని గతేడాది ఏప్రిల్‌లో ఈసీ తిరస్కరించింది.

దీంతో ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. వివిధ పార్టీలకు కేటాయించే గుర్తులను ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకునేలా పరిమితం చేయాలని, వాటిని లోగోలుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వవద్దని కోరారు. గుర్తులను నిత్యం వాడుకునేందుకు అనుమతి ఇస్తే, ఏ పార్టీతోనూ సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈసీని ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాధుర్, జస్టిస్ పీయూష్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం.. పిల్‌పై తన స్పందనను తెలియజేయాల్సిందిగా ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. అలాగే, ఇతర రాజకీయ పార్టీలను కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలంటూ కాళీ శంకర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. పిల్‌పై తమ స్పందనను తెలియజేసేందుకు సమయం ఇవ్వాలని ఈసీ తరపు న్యాయవాది కోర్టును కోరారు.


More Telugu News