రేపు దేశవ్యాప్త ఆందోళనలకు రైతు సంఘాల పిలుపు

  • ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయం
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష
  • రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయన్న నేతలు
  • ఈ నెల 19 నుంచి తలపెట్టిన ఆమరణ దీక్ష రద్దు
  • ఉత్తరాఖండ్ రైతులు మద్దతు తెలిపారన్న కేంద్రమంత్రి తోమర్
జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు రేపు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చాయి. రేపు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తాము నిరసన తెలుపుతున్న ప్రాంతాల్లోనే రైతులు దీక్ష చేయనున్నారు. మిగతా రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతు సంఘాలన్నీ ఐక్యంగానే ఉన్నాయని సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్ష రద్దు చేసినట్టు రైతు సంఘాలు వెల్లడించాయి.

అటు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, కొత్త వ్యవసాయ చట్టాలకు కొన్ని రైతు సంఘాలు మద్దతిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాఖండ్ రైతులు తనను కలిసి కొత్త చట్టాలకు మద్దతు తెలిపారని వివరించారు. కొత్త చట్టాలను అర్థం చేసుకున్న ఉత్తరాఖండ్ రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సాగు చట్టాలకు మద్దతిచ్చే సంఘాలకు, నేతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తోమర్ చెప్పారు.


More Telugu News