విజయవంతంగా నింగికెగసిన పీఎస్ఎల్వీ సి50 రాకెట్
- శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగం
- 42వ కమ్యూనికేషన్స్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-50
- మరికాసేపట్లో నిర్దేశిత కక్ష్యలోకి సీఎంఎస్-01
- కరోనా వ్యాప్తి తర్వాత రెండో ప్రయోగం చేపట్టిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో రాకెట్ ప్రయోగం నిర్వహించింది. శ్రీహరికోటలోని రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సి-50 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసింది. విపత్తుల నిర్వహణ, ఇంటర్నెట్ సేవల కోసం ఉద్దేశించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ తనతో పాటు మోసుకెళ్లింది. ప్రస్తుతం ఈ సీఎంఎస్-01 శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. కాగా, కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది. కౌంట్ డౌన్ లో ఎలాంటి అవాంతరాలు ఎదురవకపోవడంతో నిర్దేశిత సమయానికే ఈ రాకెట్ రోదసిలోకి దూసుకుపోయింది.