బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి సాయిప్రతాప్ స్పందన!

  • నేను బీజేపీలో చేరడం లేదు
  • ఇకపై కూడా టీడీపీలోనే కొనసాగుతా
  • నా అల్లుడు బీజేపీలో చేరుతున్నారు
సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ బీజేపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజంపేటలో త్వరలో నిర్వహించనున్న బహిరంగ సభలో సునీల్ దేవధర్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సమక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. మరోవైపు, ఆయన బీజేపీలో చేరితే కడప జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని కమలనాథులు కూడా భావించారు. ఈ నేపథ్యంలో, ఈ అంశంపై సాయిప్రతాప్ స్పందించారు.

బీజేపీలో చేరుతున్నట్టు తన గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని సాయిప్రతాప్ తెలిపారు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తన అల్లుడు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సాయిప్రతాప్ క్లారిటీ ఇవ్వడంతో... ఈ ప్రచారానికి ముగింపు పలికినట్టైంది.

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా సాయిప్రతాప్ కు గుర్తింపు ఉంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానానికి ఆయన టికెట్ ఆశించారు. అయితే, ఆయనకు టికెట్ దక్కకపోవడంతో... అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు.


More Telugu News