వర్మ అవకాశం ఇస్తే.. జగన్ పాత్రను నేనే పోషిస్తా: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి

  • ఇళ్ల పట్టాల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుంది
  • సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వస్తాయి
  • 'అల వైయస్ అవినీతిపురములో' అనే సినిమాను వర్మ తీయాలి
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఈ అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే... నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బండారు ఒక కోరిక కోరారు. ఇళ్ల స్థలాల అంశం ఆధారంగా వర్మ ఒక సినిమాను తెరకెక్కించాలని అన్నారు. ఆ సినిమాలో జగన్ పాత్రను తానే పోషిస్తానని చెప్పారు. ఆ చిత్రానికి 'అల వైయస్ అవినీతిపురములో' అని టైటిల్ పెట్టాలని అన్నారు. జగన్ అవినీతి మొత్తం తనకు తెలుసని చెప్పారు. తాను కూడా మంచి నటుడినే అని... అందుకే జగన్ పాత్రను తానే పోషించాలనుకుంటున్నానని అన్నారు. వర్మ తనకు అవకాశాన్ని ఇస్తే తప్పకుండా నటిస్తానని చెప్పారు. 


More Telugu News