అమెరికాలోనే అత్యంత కిరాతక సీరియల్​ కిల్లర్​ శామ్యూల్​ లిటిల్​ మృతి!

  • కాలిఫోర్నియా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి
  • 19 రాష్ట్రాలు.. 93 హత్య కేసుల్లో నిందితుడు
  • తొలిసారి 2018లో తన నేరాలను ఒప్పుకొన్న శామ్యూల్
శామ్యూల్ లిటిల్.. అమెరికా చరిత్రలోనే అత్యంత కిరాతక సీరియల్ కిల్లర్ అని పేరు. 80 ఏళ్ల ఆ సీరియల్ కిల్లర్ బుధవారం ఉదయం చనిపోయాడు. కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించాడని కాలిఫోర్నియా డిపార్ట్ మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అండ్ రీహాబిలిటేషన్ అధికారులు వెల్లడించారు.

40 ఏళ్లలో 19 రాష్ట్రాల్లో 93 మందిని అత్యంత కిరాతకంగా చంపేశాడు శామ్యూల్ లిటిల్. మహిళలే లక్ష్యంగా చేసుకున్నాడు. సెక్స్ వర్కర్లు, మాదకద్రవ్యాలకు బానిసైనవారు, పేదలనే లక్ష్యంగా చేసుకుని, చంపేశాడు. అందులోనూ ఎక్కువగా నల్లజాతి వారినే హత్య చేశాడు. అయితే, ఆ హత్యలు ఎవరు చేశారన్న దానిని పోలీసులు కూడా తేల్చలేకపోయారు. 2014లో జరిగిన మూడు హత్యల్లో డీఎన్ఏ ఆధారంగా శామ్యూల్ ను కోర్టు దోషిగా తేల్చింది. అయితే, తాను నిర్దోషినని, తనకే పాపం తెలియదని 2018 దాకా అతడు వాదిస్తూ వచ్చాడు.

చివరగా తాను హత్యలకు పాల్పడిన చిట్టాను 2018 నుంచి విప్పుతూ వచ్చాడు. టెక్సాస్ కు చెందిన రేంజర్ కు తన హత్యలను వివరించాడు. కోర్టు అతడికి చాలా కేసుల్లో జీవిత ఖైదులను విధించింది. కాలిఫోర్నియా జైలులో శిక్ష అనుభవించాడు. అతడి బాధిత కుటుంబాలను ఇప్పటికీ పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వారి జాడ మాత్రం దొరకలేదు. ఇప్పుడు శామ్యూల్ మరణంతో అది మరింత కష్టమవుతుందని భావిస్తున్నారు.


More Telugu News