ఇప్పుడు చెప్పండి... నైట్ ఏంచేద్దాం అనుకుంటున్నారు మరి!: మహేశ్ బాబు ఫొటోతో సైబరాబాద్ పోలీసుల ఆసక్తికర ట్వీట్

  • మరికొన్ని గంటల్లో భారత్ లో కొత్త సంవత్సరం
  • యువతను కట్టడి చేసేందుకు రంగంలోకి పోలీసులు
  • తాగి వాహనాలు నడపొద్దని స్పష్టీకరణ
  • భద్రతే ముఖ్యమని వెల్లడి
మరికాసేపట్లో భారత్ లోనూ నూతన సంవత్సరాది ఘడియలు రానున్నాయి. కొత్త సంవత్సరం అంటే ప్రజల ఉత్సాహం గురించి చెప్పేదేముంది! అయితే ఇది కరోనా కాలం కావడంతో ఎక్కడికక్కడ ఆంక్షలు ఉన్నాయి. తెలంగాణలోనూ నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు.

హైదరాబాదులో ఈ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అత్యధిక ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, ఈ అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరిచి ఉంచుతారు. బార్లలో ఒంటిగంట వరకు మద్యం సరఫరా ఉంటుంది.

ఈ నేపథ్యంలో, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు యువతను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేశారు. 'ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు... నైట్ ఏం చేద్దామనుకుంటున్నారు మరి!' అంటూ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫోటోతో ట్వీట్ చేశారు.

మహేశ్ బాబు ఓ సినిమాలో "ఇప్పుడు చెప్పండి... వాట్ టు డూ వాట్ నాట్ టు డూ" అంటూ చెప్పిన డైలాగ్ ఎంతో పాప్యులర్ అయింది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా అదే తరహాలో నగర యువతను ఉద్దేశించి ప్రశ్నించారు. నూతన సంవత్సర వేడుకలైనా, మరే సందర్భమైనా భద్రతే ముఖ్యమని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని హితవు పలికారు.


More Telugu News