జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు

  • మౌనదీక్ష చేప‌డ‌తాన‌న్న ప్ర‌భాక‌ర్ రెడ్డి
  • ఉద్రిక్త‌త‌లు త‌లెత్త‌కుండా పోలీసుల చ‌ర్య‌లు
  • దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో గృహ నిర్బంధం
  • ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన నివాసంలో నిర్బంధం
  • ఎమ్మార్వో ఆఫీసుకి వెళ్లిన‌ ప్రభాకర్‌రెడ్డి భార్య  
తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించిన  నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు చెల‌రేగ‌కుండా జేసీ సోదరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో గృహ నిర్బంధం చేయ‌గా, ఆయ‌న సోద‌రుడు ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన నివాసంలో నిర్బంధించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారని  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాడిపత్రిలో గత నెల 24న తేదీన టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య  రాళ్ల దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. దీంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులను నమోదు చేయ‌డంతో వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీక్ష చేస్తాన‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌క‌టించ‌డంతో అనంతపురం నుంచి తాడిపత్రి వరకు భారీగా పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.  

ప్రభాకర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేయడంతో ఆయన భార్య ఉమారెడ్డి అంబేద్క‌ర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, అనంతరం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. దీంతో అప్ప‌టికే పోలీసులు ఎమ్మార్వో ఆఫీసుకి తాళం వేయించారు. ప్ర‌స్తుతం జేసీ ప్రభాకర్‌రెడ్డిని గృహనిర్బంధంలో ఉంచడంతో, ఆయన ఇంటి వెలుపల దీక్షకు దిగారు. దీంతో ఆయనకు పోలీసులు సెక్షన్‌ 149 కింద నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు రావ‌ద్ద‌ని చెప్పారు.


More Telugu News