వలస పక్షులే బర్డ్ ఫ్లూ వ్యాప్తికి కారణం: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
- దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం
- సెప్టెంబరులో బర్డ్ ఫ్లూ రహిత దేశంగా ప్రకటించామన్న మంత్రి
- ప్రస్తుతం బర్డ్ ఫ్లూ విదేశీ పక్షుల వల్లేనని వెల్లడి
- వలస పక్షుల ఆవాసాల్లోనే అధికంగా కేసులు
కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంపై స్పందించారు. విదేశాల నుంచి భారత్ వచ్చే వలస పక్షుల వల్లే బర్డ్ ఫ్లూ మనదేశంలో మళ్లీ కనిపిస్తోందని తెలిపారు. బర్డ్ ఫ్లూ కేసులు ప్రపంచం మొత్తం ఉన్నాయని, అయితే గత సెప్టెంబరులో భారత్ ను బర్డ్ ఫ్లూ రహిత దేశంగా ప్రకటించామని, శీతాకాలం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్టోబరులో రాష్ట్రాలకు సలహా ఇచ్చామని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. అయితే, ఇప్పుడు భారత్ లో మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు వస్తుండడానికి కారణం విదేశాల నుంచి వచ్చే వలస పక్షులేనని తెలిపారు. దేశంలో వలస పక్షులకు ఆవాసంగా ఉండే ప్రాంతాల్లోనే బర్డ్ ఫ్లూ కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.