గుంటూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం.. మరో చోటుకి రోగుల తరలింపు

  • రాత్రి 9.45 గంటల సమయంలో ఐసీయూ సమీపంలో మంటలు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందన్న పోలీసులు
  • పాక్షికంగా దెబ్బతిన్న ఆక్సిజన్ పైపు
గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో గత రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి దాదాపు 10 గంటల సమయంలో ఐసీయూ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది ఐసీయూలోని రోగులను వెంటనే మరో చోటుకి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని కొత్తపేట సీఐ ఎస్‌వీఎస్ రాజశేఖరరెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఐసీయూ వార్డులో 15 మంది కొవిడ్ బాధితులు ఉన్నట్టు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా రోగులను మరో చోటుకి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం అంతా సాధారణంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రమాదంలో ఆక్సిజన్ సరఫరా చేసే పైపు పాక్షికంగా దెబ్బతిన్నట్టు సీఐ పేర్కొన్నారు.


More Telugu News