కారుణ్య నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలు పెళ్లయిన కూతురుకి కూడా ఉంటాయి: అలహాబాద్ హైకోర్టు

  • పెళ్లైన కూతురుని కుటుంబ సభ్యురాలిగా చూడొద్దన్న జిల్లా విద్యాశాఖ అధికారి
  • ఇది వివక్ష కిందకు వస్తుందన్న హైకోర్టు
  • కొడుకుకు ఉన్న అన్ని అర్హతలు పెళ్లైన కుమార్తెకు కూడా వస్తాయని తీర్పు
కొడుకులతో పాటు కుమార్తెలకు కూడా అన్నిట్లో సమాన హక్కులు ఉంటాయంటూ ఇప్పటికే పలు తీర్పులను కోర్టులు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇలాంటి తీర్పునే మరొకసారి వెలువరించింది. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో కొడుకును ఏ విధంగానైతే భాగస్వామిగా చూస్తారో పెళ్లైన కూతురుని కూడా అదే విధంగా చూడాలని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

కేసు వివరాల్లోకి వెళ్తే... ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే పెళ్లైన కూతురుని కుటుంబంలో సభ్యురాలిగా చూడరాదంటూ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వులను మంజుల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను విచారించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

పెళ్లైన కొడుకుని ఎప్పటికీ కుటుంబ సభ్యుడిగా చూస్తారని... కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్లో కొడుకు అర్హుడిగా ఉన్నాడని... కూతురుని మాత్రం వేరుగా ఎందుకు చూడాలనుకుంటున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. పెళ్లైన కూతురుని దేనికైనా అనర్హురాలిగా చూడటం అంటే వివక్ష కిందకు వస్తుందని చెప్పింది. కారుణ్య ఉద్యోగ నియామకాల్లో కొడుకుకు ఉన్న అర్హతలే... పెళ్లైన కూతురుకి కూడా ఉంటాయని తెలిపింది. పెళ్లైన కూతురు కారుణ్య నియామకాలకు అర్హురాలు కాదని చెప్పడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంది.


More Telugu News