డీఆర్ఎస్ కోసం పట్టుబట్టిన పంత్ ను చూసి పగలబడి నవ్విన రోహిత్ శర్మ... వీడియో ఇదిగో!

  • బ్రిస్బేన్ లో భారత్, ఆసీస్ మధ్య నాలుగో టెస్టు
  • తొలిరోజు ఫీల్డింగ్ చేసిన భారత్
  • పైన్ క్యాచ్ అవుట్ అయినట్టు పంత్ అప్పీల్
  • స్పందించని ఇతర ఆటగాళ్లు
  • సందడి చేస్తున్న వీడియో
బ్రిస్బేన్ టెస్టు తొలిరోజున మైదానంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా, భారత్ ఫీల్డింగ్ చేసింది. అయితే, ఇన్నింగ్స్ 84వ ఓవర్ వద్ద టి.నటరాజన్ బౌలింగ్ లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఆడిన బంతి వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతుల్లో వాలింది. బ్యాట్ తగిలిందని భావించిన పంత్ బిగ్గరగా అప్పీల్ చేశాడు. అయితే, స్లిప్స్ లో ఉన్న పుజారా, రోహిత్ శర్మ, రహానే మాత్రం ఎలాంటి అప్పీల్ చేయలేదు. దాంతో కెప్టెన్ రహానే వద్దకు వెళ్లిన పంత్ డీఆర్ఎస్ తీసుకోవాల్సిందిగా కోరాడు.

రహానే అది క్యాచ్ కాదని చెప్పడంతో పంత్ డీఆర్ఎస్ తీసుకోవాలంటూ ప్రాధేయపడినంత పనిచేశాడు. రహానే తన అభిప్రాయానికి కట్టుబడి ఉండడంతో పంత్ ఆవేశంతో బంతిని నేలకేసి కొట్టబోయి తమాయించకున్నాడు. ఆపై తీవ్ర నిరాశతో వెనుదిరగ్గా, అక్కడే ఉన్న రోహిత్ శర్మ పగలబడినవ్వాడు. తనను చూసి నవ్వుతున్న రోహిత్ శర్మ వైపు ఓ లుక్కేసిన పంత్ ఏమీ అనలేక తన పొజిషన్ కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.


More Telugu News