మమతా బెనర్జీని 50 వేల మెజారిటీతో ఓడిస్తా... సవాల్ విసిరిన సువేందు అధికారి

  • మమతకు కుడిభుజంగా కొనసాగిన సువేందు అధికారి
  • ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరిక
  • మమత, సువేందు మధ్య మాటల యుద్ధం
  • నందిగ్రామ్ లో పోటీ చేస్తానన్న మమత
  • అర లక్ష ఓట్ల తేడాతో ఓటమి ఖాయమన్న సువేందు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఇన్నాళ్లు కుడిభుజంగా వ్యవహరించిన సువేందు అధికారి ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఇవాళ నందిగ్రామ్ లో జరిగిన ఓ సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై నందిగ్రామ్ సిట్టింగ్ ఎమ్మెల్యే సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు.

నందిగ్రామ్ లో మమత పోటీ చేసేట్టయితే ఆమెను 50 వేల ఓట్ల మెజారిటీతో ఓడిస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ తాను మమత చేతిలో ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. మమతకు నందిగ్రామ్ కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తొస్తుందని విమర్శించారు. నందిగ్రామ్ కోసం ఆమె ఏంచేసింది? అని సువేందు అధికారి ప్రశ్నించారు. ఈ ప్రాంతం ఆమెను ఎన్నటికీ క్షమించబోదని అన్నారు. తానే కాదు, నందిగ్రామ్ నుంచి ఏ బీజేపీ నేత పోటీ చేసినా అర లక్ష ఓట్ల తేడాతో మమతకు ఓటమి ఖాయం అని వ్యాఖ్యానించారు.

అంతకుముందు, నందిగ్రామ్ లో మమతా బెనర్జీ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని గెలవాలని భావిస్తున్న సువేందు అధికారి ముందు స్థానిక టీఎంసీ నేతలపై నెగ్గాలని సూచించారు.


More Telugu News