జాత్యహంకార వ్యాఖ్యల నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెల్లడించిన సిరాజ్

  • ఆసీస్ పర్యటనలో జాత్యహంకార వ్యాఖ్యల కలకలం
  • సిరాజ్, బుమ్రా లక్ష్యంగా వ్యాఖ్యలు
  • తీవ్రంగా పరిగణించిన టీమిండియా
  • మ్యాచ్ అధికారులకు ఫిర్యాదు
  • మ్యాచ్ నుంచి తప్పుకునే అవకాశమిచ్చిన అంపైర్లు
  • కొనసాగాలని టీమిండియా నిర్ణయం
హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తొలి విదేశీ పర్యటనలోనే జాత్యహంకార వ్యాఖ్యలకు గురయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో సిరాజ్ ను లక్ష్యంగా చేసుకుని కంగారూ ఫ్యాన్స్ జాతి వివక్ష పదజాలంతో దూషించడం తెలిసిందే. తాజాగా, ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సిరాజ్ ఆసక్తికర అంశాలు వెల్లడించాడు.

సిడ్నీలో మూడో టెస్టు సందర్భంగా కొందరు ప్రేక్షకులు తనతో పాటు బుమ్రాను కూడా లక్ష్యంగా చేసుకుని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, ఈ విషయాన్ని తాను కెప్టెన్ రహానేకు వివరించానని తెలిపాడు. ఈ విషయం మ్యాచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పాడు. అయితే, దూషణల నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకునే అవకాశాన్ని అంపైర్లు భారత జట్టుకు కల్పించారని పేర్కొన్నాడు. కానీ, రహానే అంపైర్ల ప్రతిపాదనను అంగీకరించలేదని, తాము మ్యాచ్ లో కొనసాగుతామని స్పష్టం చేశాడని సిరాజ్ వివరించాడు.

"మేం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి, మ్యాచ్ లో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్ కు కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగినా, చివరికి ఉత్కంఠభరితమైన డ్రాగా ముగించాం. ఈ టెస్టు సిరీస్ లో నా పట్ల ప్రేక్షకుల వైఖరి నాలో పట్టుదలను మరింత పెంచింది. వారి వ్యాఖ్యలు నన్ను మానసికంగా మరింత రాటుదేల్చాయి. ఆ వ్యాఖ్యలను నా మనసు మీదకు తీసుకోలేదు. తద్వారా నా ఆటతీరు దెబ్బతినకుండా చూసుకున్నాను" అని వివరించాడు.


More Telugu News