నేను దోపిడీ మేనల్లుడినా?.. 36 గంటల్లోగా క్షమాపణ చెప్పాల్సిందే: సువేందుకు మమత మేనల్లుడి నోటీసు

  • మంగళవారం నిర్వహించిన ర్యాలీలో అభిషేక్‌పై తీవ్ర విమర్శలు చేసిన సువేందు
  • బేషరతు క్షమాపణ చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక
  • క్రిమినల్ కేసుల్లోని వ్యక్తి ఆరోపణలు చేయడం విడ్డూరం
తనను ‘దోపిడీల మేనల్లుడు’ అంటూ మంగళవారం నాటి ర్యాలీలో టీఎంసీ మాజీ నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన సువేందు 36 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ నోటీసులు పంపారు.

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకున్నా తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అభిషేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువులోగా స్పందించకుంటే చట్టప్రకారం ముందుకెళ్తామని అభిషేక్ తరపు న్యాయవాది హెచ్చరించారు.

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరించిన సువేందు అధికారి ఇటీవల తన పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ పార్టీలో చేరినప్పటి నుంచి టీఎంసీపై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం నాటి ర్యాలీలో అభిషేక్ బెనర్జీని ‘దోపిడీల మేనల్లుడు’ అంటూ అభివర్ణించారు.


More Telugu News