రాబోయే రోజుల్లో టీఎంసీ ఖాళీ అవుతుంది.... అన్ని స్థానాల్లో మమతానే పోటీ చేస్తారేమో!: సువేందు అధికారి వ్యంగ్యం

  • ఇటీవల టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేందు
  • మమతా బెనర్జీపై విమర్శల పర్వం
  • నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానన్న మమత
  • మమత ఎక్కడ పోటీ చేసినా మోత తప్పదన్న సువేందు
ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న సువేందు అధికారి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన టీఎంసీని వీడినప్పటి నుంచి సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇటీవల సువేందు నియోజక వర్గమైన నందిగ్రామ్ నుంచి కూడా తాను పోటీచేస్తానని మమత ప్రకటించారు. తాజాగా ఓ సభలో దీనిపై స్పందించిన సువేందు అధికారి... రాబోయే రోజుల్లో టీఎంసీ నుంచి అందరూ  బయటికి వచ్చేస్తారని, అప్పుడు అన్ని స్థానాల్లోనూ మమతా బెనర్జీనే పోటీ చేస్తారేమో! అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

అంతేకాదు, మమత దాంజూర్, బాలీ సీట్లలోనూ పోటీ చేస్తానని అంటున్నారు... ఆమె ఎక్కడికి వెళ్లినా పరాభవం తప్పదు అంటూ వ్యాఖ్యానించారు. సువేందు అధికారి మమత కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మమతకు కుడిభుజం వంటి వ్యక్తి అని భావించిన సువేందు టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరడం పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


More Telugu News