కరోనా గురించి బయటకు పొక్కకుండా స్థానిక అధికారులు కుట్ర పన్నారు: చైనా జాతీయుడి ఆరోపణ

  • వైరస్ ఉన్న సంగతి ముందే చెబితే వుహాన్ వెళ్లే వాళ్లం కాదు
  • నా తండ్రి మరణానికి అధికారులే కారణం
  • అనుమతి ఇస్తే డబ్ల్యూహెచ్ఓ బృందానికి ప్రభుత్వ కుట్ర గురించి చెబుతా
కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో పుట్టిందన్నది జగద్వితమే. ఆ తర్వాత ఆ మహమ్మారి ప్రపంచం మొత్తానికి పాకి అతలాకుతలం చేసింది. లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ ప్రాణాంతక వైరస్ వెలుగు చూసిన తర్వాత  ఆ వార్త బయటకు రాకుండా ఉండేందుకు చైనా ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా జాతీయుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ప్రస్తుతం వైరస్ మూలాలను గుర్తించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనాలో పర్యటిస్తోంది. తనకు కనుక వారు అవకాశం ఇస్తే వారికి అన్ని వివరాలు ఇస్తానని ఝంగ్ హై అనే వ్యక్తి పేర్కొన్నాడు. వైరస్ విషయం వుహాన్ దాటకుండా ఉండేందుకు స్థానిక అధికారులు ఎలాంటి కుట్ర చేసిందీ వారికి వివరిస్తానని చెప్పుకొచ్చాడు. తన తండ్రి మరణానికి అధికారుల కుట్రే కారణమని ఆరోపించాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఝంగ్ హై తండ్రికి శస్త్రచికిత్స నిమిత్తం వారి కుటుంబం వుహాన్ వచ్చింది. అక్కడాయనకు కరోనా సోకడంతో మరణించారు. వుహాన్‌లో వైరస్ ఉన్నట్టు అధికారులు ముందే ప్రకటించి ఉంటే తాము అక్కడికి వచ్చేవాళ్లం కాదని ఝంగ్ పేర్కొన్నాడు. అధికారులు ఈ విషయాన్ని దాచడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.

వారి మరణాలన్నీ ప్రభుత్వం తెలిసి చేసిన హత్యలేనని పేర్కొన్నాడు. అధికారులు తనకు క్షమాపణ చెప్పే వరకు విశ్రమించబోనని, ఆన్‌లైన్ వేదికగా పోరాడతానని పేర్కొన్నాడు. వైరస్ గురించి విషయాలను బయటపెడుతున్న తనను గతంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారని ఝంగ్ హై తెలిపాడు.


More Telugu News