ఇదే మా ఇల్లు... దుగ్గిరాలలో తన నివాసాన్ని తహసీల్దార్ కు చూపించిన నిమ్మగడ్డ

  • ఏపీలో నిమ్మగడ్డ వర్సెస్ సర్కారు
  • నిమ్మగడ్డ ఓటు దరఖాస్తు తిరస్కరణ
  • ఇవాళ దుగ్గిరాల వెళ్లిన నిమ్మగడ్డ
  • స్వాగతం పలికిన తహసీల్దార్
గతంలో మరే ఎస్ఈసీ ఇంత చర్చనీయాంశం అయ్యుండరు అనిపించేలా నిత్యం మీడియాలో కనిపించడం ఏపీ ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కే చెల్లింది. కొంతకాలంగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల వ్యవహారంతో అది పరాకాష్ఠకు చేరింది.

 కాగా, ఇటీవలే నిమ్మగడ్డ తన స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైనట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని తన నివాసానికి వెళ్లారు. ఆయన రాక నేపథ్యంలో స్థానిక తహసీల్దార్ పుష్పగుచ్ఛంతో నిమ్మగడ్డకు స్వాగతం పలికారు.

దాంతో నిమ్మగడ్డ స్పందిస్తూ... నేనే మీ వద్దకు రావాలనుకుంటున్నాను... మీరే వచ్చారా..? అంటూ తహసీల్దార్ ను పలకరించారు. అంతేకాదు, ఇదే మా ఇల్లు.. చూడండి అంటూ దుగ్గిరాల తహసీల్దార్ కు తన నివాసాన్ని స్వయంగా దగ్గరుండి చూపించారు. కాగా, నిమ్మగడ్డ దుగ్గిరాలలో నివాసం ఉండడం లేదని ఆయన ఓటు దరఖాస్తును అధికారులు తిరస్కరించినట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దుగ్గిరాల వెళ్లినట్టు తెలుస్తోంది.


More Telugu News