తెలంగాణ ద్రోహి కేసీఆర్: మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

  • దళితులను అవమానిస్తే సహించబోము
  • అనుచిత వ్యాఖ్యలు చేసిన ధర్మారెడ్డిని బర్తరఫ్ చేయాలి
  • కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై, టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. దళితులను అవమానిస్తే సహించబోమని అన్నారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను కూడా గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని... ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయో తేల్చుకుందామా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని అన్నారు.

మరోవైపు ధర్మారెడ్డిపై హెచ్చార్సీలో ఫిర్యాదు నమోదైంది. జాతీయ బీసీ సంఘం అధికార ప్రతినిధి దాసు సురేశ్ ఈ ఫిర్యాదు చేశారు. బీసీ, దళిత ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించిన ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా మండిపడ్డారు. ధర్మారెడ్డిపై కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీనవర్గాల వ్యతిరేకిగా కేసీఆర్ ప్రభుత్వం తయారైందని విమర్శించారు.


More Telugu News