రేషన్ కోసం తిప్పలు: తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో ఆధార్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరిన ప్ర‌జ‌లు

  • ఆదిలాబాద్‌లో ఆధార్ కేంద్రం వ‌ద్ద బారులు తీరిన స్థానికులు
  • సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌లో స్థానికులు రోడ్డుపై బైఠాయింపు
  • అక్క‌డ ఆధార్ కేంద్రాన్ని సిబ్బంది తెర‌వ‌డం లేద‌ని ఆందోళ‌న‌
  • వృద్ధులు, మ‌హిళ‌లు ఉద‌యం నుంచే ఆధార్ కేంద్రాల వ‌ద్ద లైన్లు
తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో  ఆధార్ కేంద్రాల ‌వ‌ద్ద ప్ర‌జ‌లు బారులు తీరి నిల‌బడ్డారు. తెలంగాణ‌లో రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానానికి స్వ‌స్తి ప‌లికి, సరుకులు తీసుకోవాలంటే లబ్ధిదారులు తమ సెల్‌ఫోన్లకు వచ్చిన ఓటీపీ చూపించాల‌ని నిబంధ‌న తీసుకొచ్చారు. అయితే, అక్క‌డే చిక్కంతా వ‌చ్చింది. రేషన్‌కార్డుదారులు త‌మ‌ సెల్‌ ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని నిబంధ‌న విధించారు.  

మొన్న‌టి నుంచే ఈ విధానం అమల్లోకి రావ‌డంతో ఆధార్-సెల్‌ఫోన్ నంబ‌రు అనుసంధానం లేని వారు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.  ఈ నేప‌థ్యంలోనే ఆధార్ కేంద్రాల వ‌ద్ద రేష‌న్ కార్డుదారులు బారులు తీరుతున్నారు. ఈ రోజు ఉద‌యం తెల్ల‌వారుజాము నుంచే ఆధార్ కేంద్రాల వ‌ద్ద‌కు చేరుకుని క్యూలో నిల‌బ‌డ్డారు. ఆదిలాబాద్ కేంద్రం‌లో ఆధార్ సెంట‌ర్ వ‌ద్ద స్థానికులు బారులు తీరి నిల‌బ‌డ్డారు.

అలాగే, ప‌లు జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌న‌ప‌డుతోంది. ఒక్క‌సారిగా ప్ర‌జ‌లు బారీ సంఖ్య‌లో వ‌స్తుండ‌డంతో ఆధార్ కేంద్రాల సిబ్బంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌లో ఆధార్ కేంద్రాన్ని సిబ్బంది తెర‌వ‌డం లేద‌ని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జాం అవుతోంది. ప‌లు జిల్లాలలో వృద్ధులు, మ‌హిళ‌లు ఉద‌యం నుంచే ఆధార్ కేంద్రాల వ‌ద్ద నిల‌బ‌డ్డారు. భారీగా లైన్లు ఉండ‌డంతో నానా ఇబ్బందులు ప‌డుతున్నారు.


More Telugu News