ఎస్ఈసీ మాట వినొద్దంటూ అధికారులను హెచ్చరించిన పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి: వర్ల రామయ్య
- అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
- అభ్యంతరం వ్యక్తం చేసిన వర్ల రామయ్య
- రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారని విమర్శలు
- మంత్రిగా కొనసాగే హక్కులేదని వెల్లడి
ఎస్ఈసీ మాట విని ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారులను తాము అధికారంలో ఉన్నన్నాళ్లు గుర్తుంచుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించడం తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. రాజ్యాంగం ప్రకారం నడుస్తానని ప్రమాణం చేసిన మంత్రి రామచంద్రారెడ్డి... రాజ్యాంగ వ్యవస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట అధికారులెవరూ వినొద్దని హెచ్చరించారని, ఇది కచ్చితంగా రాజ్యాంగ ధిక్కరణే అని తెలిపారు. మంత్రిగా ఒక్కరోజు కూడా కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదని స్పష్టం చేశారు. వెంటనే గవర్నర్ ఆయనను బర్తరఫ్ చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.