అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి

  • స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తుల ఎదురుచూపులు
  • స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
  • ఆలయం వద్ద భక్తుల కోలాహలం
సూర్యభగవానుడు కొలువైన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభం కాగా, విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, ఆలయ ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారికి మహా క్షీరాభిషేకం నిర్వహించారు.

మరోవైపు, స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలలో వేచి ఉన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకోవడంతో రద్దీ ఏర్పడింది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ జె.నివాస్, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్, వైసీపీ నేతలు మామిడి శ్రీకాంత్, దువ్వాడ శ్రీనివాస్, కిల్లి కృపారాణి దంపతులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు ఇప్పటికే స్వామి వారిని దర్శించుకున్నారు.


More Telugu News