సాయ్... భారత సైన్యానికి కొత్త యాప్!

  • సొంత మెసేజింగ్ యాప్ ను అభివృద్ధి చేసిన సైన్యం
  • వాట్సాప్ కు దీటుగా ఉంటుందన్న ఆర్మీ చీఫ్
  • తమ అధికారుల్లో ఒకరు ఈ యాప్ సృష్టికర్త అని వెల్లడి
  • అనుమతుల కోసం వేచిచూస్తున్నామని వివరణ
అనేక సోషల్ మెసేజింగ్ యాప్ లు అందుబాటులో ఉన్నప్పటికీ దేశ రక్షణ నేపథ్యంలో సొంత మెసేజింగ్ యాప్ వైపు భారత సైన్యం దృష్టి సారించింది. సైనికుల కోసం సొంతంగా ఓ యాప్ తీసుకువస్తోంది. దీనిపేరు 'సాయ్'. అంటే సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (ఎస్ఏఐ). భారత సైన్యంలో అంతర్గత సమాచార, భావ వ్యక్తీకరణ కోసం ఈ యాప్ ను ప్రవేశపెడుతున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ యాప్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఈ యాప్ ను కల్నల్ సాయి శంకర్ అభివృద్ధి చేశారని, ప్రస్తుతం ఇది సైబర్, సెక్యూరిటీ, డేటా టెస్టింగ్ అనుమతులు పొందేందుకు పరిశీలనలో ఉందని నరవాణే వివరించారు. తమ అధికారుల్లో ఒకరు రూపొందించిన ఈ సాఫ్ట్ వేర్ అప్లికేషన్ వాట్సాప్ కు సరితూగుతుందని గర్వంగా చెప్పారు. దీని సేవలు కేవలం సైన్యానికే పరిమితం అని స్పష్టం చేశారు. ఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ వెబినార్ లో నరవాణే ఈ వివరాలు తెలిపారు.


More Telugu News