వైసీపీ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డిపై దాడి

  • గుంటూరు జేకేసీ కాలేజీ వద్ద మోదుగులపై దాడి
  • ఆయన వాహనంపై రాళ్లు రువ్విన వైనం
  • దాడిలో ధ్వంసమైన రెండు కార్లు
ఏపీలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చిన్నచిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే, చివరి ఘడియలో గుంటూరులో ఊహించని ఘటన జరిగింది. మాజీ ఎంపీ, వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల రెడ్డిపై దాడి జరిగింది. నగరంలో పలుచోట్ల రిగ్గింగుకు పాల్పడ్డారంటూ వైసీపీ, టీడీపీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో మోదుగుల జేకేసీ కాలేజీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి, ఓట్లు వేయిస్తున్నారనే భావనతో మోదుగులపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి.

మోదుగుల కారులో ఉన్న సమయంలోనే ఆయన కారుతో పాటు, ఆయనతో పాటు వచ్చిన మరో కారును ధ్వంసం చేశారు. రెండు కార్లపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలోనే ఉన్న జిల్లా ఎస్పీ ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడున్న వారిని చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మరోవైపు, ఈ దాడిలో మోదుగులకు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. పోలీసులు ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్లారు. ప్రస్తుతం జేకేసీ కాలేజీ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.


More Telugu News