మంగళవారం నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు

  • ఫిబ్రవరిలో తొలి విడత పరీక్షలు పూర్తి
  • ఈ నెల 16 నుంచి 18 వరకు రెండో విడత
  • రోజుకు రెండు సెషన్లతో మూడ్రోజుల పాటు పరీక్షలు
  • దేశవ్యాప్తంగా హాజరు కానున్న 5 లక్షల మంది
  • ఏపీ నుంచి 53 వేల మంది హాజరయ్యే అవకాశం
దేశంలో మరోమారు జేఈఈ మెయిన్స్ పరీక్షల కోలాహలం నెలకొంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రెండో విడత పరీక్షలు రేపటి నుంచి ఈ నెల 18 వరకు జరగనున్నాయి.

ఇటీవలే ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు తొలి విడత పరీక్షలు నిర్వహించిన కేంద్రం, తాజాగా రెండో విడతకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతిరోజు రెండు సెషన్లలో మూడు రోజుల పాటు జేఈఈ మెయిన్ మలివిడత పరీక్షలు నిర్వహిస్తారు.

కాగా, ఈ రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు హాజరవుతారని భావిస్తున్నారు. ఒక్క ఏపీ నుంచే 53 వేల మంది హాజరవుతారని అంచనా. జేఈఈ మెయిన్ పరీక్షల కోసం రాష్ట్రంలో 20 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు... రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఉంటుంది. అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి 8.30 గంటల లోపు తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ల వద్దకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డు, ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరి.


More Telugu News