అసెంబ్లీ వద్ద ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం

  • స్పీక‌ర్‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన వాణీదేవి
  • ఆమె కారు దిగి వెళ్లాక ప్ర‌మాదం
  • గేటును ఢీకొన్న కారు
  • పేలిపోయిన కారు టైరు
మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన‌ సురభి వాణీదేవి కారు ఈ రోజు ఉద‌యం ప్ర‌మాదానికి గుర‌యింది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలవడానికి ఆమె అసెంబ్లీకి వచ్చారు.

వాణీదేవి కారు దిగిన అనంతరం గేట్ నంబ‌రు 8 దగ్గర పార్కింగ్ స్థలంలో వాహనం అదుపు తప్పడంతో  గేట్‌ను కారు ఢీ కొట్టింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ఆ స‌మయం‌లో భారీ శ‌బ్దం రావ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై అక్క‌డ‌కు వెళ్లారు. ఆ స‌మయంలో అందులో వాణీదేవి లేకపోవడంతో ఆమెకు ప్రమాదం తప్పింది.

కారును డ్రైవర్ కాకుండా గన్‌మన్ తీశాడని, ఆయ‌న‌కు డ్రైవింగ్ సరిగ్గా రాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన గేటు వద్ద ప్ర‌తిరోజు పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారని వారు చెప్పారు. ఎవ్వ‌రికీ గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News