అన్నాడీఎంకే నేతల వ్యాఖ్యలతో శశికళ మనస్తాపం చెంది రాజకీయాల నుంచి తప్పుకున్నారు: దినకరన్

  • ఇటీవల జైలు నుంచి విడుదలైన శశికళ
  • అనూహ్యరీతిలో రాజకీయాల నుంచి తప్పుకున్న వైనం
  • విమర్శలతో బాధకు గురైందన్న దినకరన్
  • రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది సొంత నిర్ణయమని వెల్లడి
ఇటీవలి వరకు జైల్లో ఉండొచ్చిన శశికళ మళ్లీ అన్నాడీఎంకేలో చక్రం తిప్పుతారని అందరూ భావించారు. కానీ ఆమె అనూహ్యరీతిలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.

ఆమె రాజకీయాల నుంచి వైదొలగడానికి కారణం ఏమై ఉంటుందన్నదానిపై భిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్పందించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది తన పిన్ని శశికళ సొంతంగా తీసుకున్న నిర్ణయం అని స్పష్టం చేశారు. ఆ నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలం లేదని అన్నారు.

అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీలను ఒక్కటిగా చేసేందుకు బీజేపీనే ఆమెపై ఒత్తిడి తెచ్చిందన్న వాదనలు నిజం కాదని తెలిపారు. అన్నాడీఎంకే నేతల వైఖరితో మనస్తాపం చెందడం వల్లే శశికళ రాజకీయాలకు దూరం జరిగారని దినకరన్ వివరించారు.

"బెంగళూరు నుంచి ఆమె తిరిగొచ్చాక అనేక అంచనాలు నెలకొన్నాయి. అసలామె పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగుదామని అనుకున్నారు. కానీ అన్నాడీఎంకే నాయకులు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో ఆమె మనసు గాయపడింది. ఒకప్పుడు ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంగీకరించి పాదాలకు సాగిలపడినవాళ్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలను శశికళ స్వీకరించలేకపోయారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు నాతో చెప్పారు. నన్ను మాత్రం రాజకీయ పోరాటంలో ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారు" అని దినకరన్ తెలిపారు.


More Telugu News