ఏ తమిళుడూ ఇష్టపడని పనిని సీఎం పళనిస్వామి చేస్తున్నారు: రాహుల్‌గాంధీ విమర్శలు

  • వారి వద్ద ఈడీ, సీబీఐలు ఉన్నాయి
  • ఇష్టం లేకపోయినా వాటికి భయపడి ఈపీఎస్ మోకరిల్లుతున్నారు
  • స్టాలిన్ సీఎం కావడం పక్కా, నేను గ్యారెంటీ
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి పళనిస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ తమిళుడూ ఇష్టపడని పనిని పళనిస్వామి చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

సేలంలో నిర్వహించిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. అమిత్‌షా, మోహన్ భగవత్ వంటి వ్యక్తుల కాళ్లను తాకడానికి ఏ తమిళుడూ ఇష్టపడడని కానీ, ముఖ్యమంత్రి పళనిస్వామి వారి ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. నిజానికి వారికి లొంగిపోవడం ఈపీఎస్‌కు కూడా ఇష్టం లేదని, కానీ వారి వద్ద సీబీఐ, ఈడీలు ఉన్నాయని, దీంతో ఆయన అవినీతికి పాల్పడి వుండడం వల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో మోకరిల్లాల్సి వస్తోందని అన్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఎన్నిక పక్కా అని, ఈ విషయంలో తాను హామీ ఇస్తున్నానని రాహుల్ అన్నారు. స్టాలిన్ ఎన్నిక లాంఛనమే అయినా, తేలిగ్గా తీసుకోవద్దని, పోరాటం ఇంకా మిగిలే ఉందని అన్నారు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ వద్ద డబ్బు అపరిమితంగా ఉందని అన్నారు. తొలుత వారిని తమిళనాడు నుంచి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి వారిని తరిమికొడదామని రాహుల్‌గాంధీ అన్నారు.


More Telugu News