'నన్ను మర్చిపోలేకపోతున్నారా?' అంటూ ఓ పెళ్లి వేడుకలో సందడి చేసిన డొనాల్డ్ ట్రంప్

  • ఫ్లోరిడాలో జరిగిన వివాహ వేడుకకు హాజరు
  • వధూవరులను అభినందిస్తూ ప్రసంగం
  • బైడెన్ పై సెటైర్లు వేసిన ట్రంప్
ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగోలో జరిగిన ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులను అభినందిస్తూ, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన గురించి తాను మాట్లాడుతూనే, తన తరువాతి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్ పై విమర్శలు గుప్పించారు.

"బిజినెస్ ఇన్ సైడర్' పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, ట్రంప్ ఈ వేడుకలో మాట్లాడుతూ, 'నన్ను మరచిపోలేకపోతున్నారా?' అని ఆహ్వానితులను ప్రశ్నించారు. తన స్నేహితులు మేగన్ నోడిరర్, జాన్ అరిగోలతో కలసి ఈ విందులో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతుంటే, అతిథుల నుంచి మంచి స్పందన వచ్చింది.

యూఎస్, మెక్సికో సరిహద్దుల విషయాన్ని ప్రస్తావించిన ఆయన, చైనా, ఇరాన్ తదితర దేశాలతో అమెరికా వైఖరిని సైతం తప్పుబట్టారు. "ఈ చిన్నారుల పరిస్థితి ఏంటి? గతంలో ఎవరూ అంత దుర్భరంగా తమ బాల్యాన్ని గడపలేదు" అని సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఆయన ప్రశ్నించారు. బైడెన్ బాధ్యతలు తీసుకున్న తరువాత వలసవాదుల సంఖ్య పెరిగిపోయిందని, అనాధ బాలలు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తు చేశారు.  

నవంబర్ లో జరిగిన ఎన్నికలను ప్రస్తావించిన ఆయన, బైడెన్ విజయాన్ని మరోమారు ప్రశ్నించారు. 70 లక్షలకు పైగా దొంగ ఓట్లు పడ్డాయని, తాను ఎంతగా ప్రయత్నించినా, వాటిని ఎదుర్కోలేకపోయానని అన్నారు. పనిలోపనిగా నూతన జంట ఎంతో అందంగా కనిపిస్తోందని, వారి భవిష్యత్తు ఆనందమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు.


More Telugu News