ఈ పోషకం తోడుంటే ఊబకాయం దూరం.. ఇష్టమైంది తినొచ్చు.. ఇష్టమొచ్చినంత తినొచ్చు!

  • సెలీనియంతో మంచి ఫలితాలు
  • ఊబకాయానికి కారణమయ్యే మిథియోనైన్ స్థాయుల్లో తగ్గుదల
  • శక్తిని కంట్రోల్ చేసే ఐజీఎఫ్ 1 హార్మోన్ లోనూ తగ్గుదల
  • ఆకలిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్ నియంత్రణ
  • జీవితకాలమూ పెరుగుతుందని తేల్చిన పరిశోధకులు
ఊబకాయం.. ప్రపంచానికి పట్టిన పెద్ద జబ్బు. పెద్దవారినే కాదు.. చిన్న పిల్లలనూ చుట్టేస్తోంది. దానితో ఎన్నెన్ని సమస్యలు! గుండె జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువ, ఆయాసం, మధుమేహం.. ఒక్కటేమిటి అది వస్తూనే సకల జబ్బులను వెంటబెట్టుకొస్తోంది. అందుకే చాలా మంది ఎక్కడ లావైపోతామోనని తినే తిండినీ తగ్గించేస్తున్నారు. ఇష్టమైన ఫుడ్డు కళ్ల ముందు కనిపిస్తున్నా నోరు కట్టేసుకుంటున్నారు.

ఇకపై అలా చేయాల్సిన అవసరం రాకపోవచ్చు! ఇష్టమైనవన్నీ నోరారా ఆరగించవచ్చు. అయితే, ఓ షరతు.. తినే ఆహారానికి జతగా ‘సెలీనియం’ అనే ఓ పోషకాన్నీ తీసుకోవాలి. అవును, ఊబకాయం ముప్పు రాకుండా సెలీనియం కాపాడుతోందని అమెరికాలోని న్యూయార్క్ కు చెందిన ఒరెన్ ట్రీచ్ ఫౌండేషన్ ఫర్ ద అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్స్ (ఒఫాస్) పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టామంటున్నారు. అంతేకాదు, వయసు మీద పడకుండా కూడా కాపాడుతోందని గుర్తించారు.

సెలీనియం పనితీరు ఇదీ..

మిథియోనైన్.. ఇదో అమైనో యాసిడ్. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయ సమస్య తీవ్రమవుతోందన్నది పరిశోధకులు చెబుతున్న మాట. అది ఎక్కువయ్యే కొద్దీ ఒంట్లో శక్తిని నియంత్రించే ఐజీఎఫ్ 1 హార్మోన్ కూడా పెరిగిపోతోందని అంటున్నారు. ఈ క్రమంలోనే మిథియోనైన్ ను తీసుకోవడం తగ్గిస్తే ఐజీఎఫ్ 1 హార్మోన్ కూడా తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. మిథియోనైన్ ను తగ్గించేదెలా? అనే ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. మిథియోనైన్ ను, ఐజీఎఫ్ 1ను సెలీనియం నియంత్రిస్తోందని గతంలో చేసిన స్టడీలు వారికి గుర్తొచ్చాయి.

వెంటనే యుక్త వయసులో ఉన్న మగ ఎలుకలు, ఆడ ముసలి ఎలుకలకు సెలీనియంను ఇచ్చి చూశారు. ఆ తర్వాత వాటికి కొవ్వు ఎక్కువగా ఉండే మూడు రకాల ఆహార పదార్థాలను పెట్టారు. మిథియోనైన్ ఎక్కువగా ఉండే ఆహారం, మిథియోనైన్ లేని ఆహారం, మిథియోనైన్ తో పాటు సెలీనియంతో కూడిన ఆహారాన్ని వాటికి తినిపించారు. సెలీనియం ఉన్న ఆహారాన్ని తిన్న ఎలుకలు లావు కాలేదని తేల్చారు. అదే సమయంలో డైట్ పాటిస్తూ మిగతా రెండు రకాల ఆహారం తిన్న ఎలుకలు మాత్రం ఊబకాయం బారిన పడ్డాయని గుర్తించారు. వాటిలో కొవ్వు స్థాయులూ ఎక్కువయ్యాయని నిర్ధారించారు.

అంతేగాకుండా ఐజీఎఫ్ 1 స్థాయులనూ పరీక్షించారు. సెలీనియం లేని ఆహారం తిన్న ఎలుకలతో పోలిస్తే సెలీనియం ఉన్న ఆహారం తిన్న ఎలుకల్లో ఐజీఎఫ్ 1 స్థాయులు భారీగా పడిపోయినట్టు గుర్తించారు. దాంతో పాటు ఆకలిని, శక్తిని నియంత్రించే మరో హార్మోన్ లెప్టిన్ స్థాయులనూ సెలీనియం తగ్గించినట్టు తేల్చారు. ఈస్ట్ (శిలీంద్రాలు)పైనా అధ్యయనం చేశారు. సెలీనియంతో దాని జీవిత కాలం ఎంత పెరుగుతోందో తేల్చారు. మామూలుగా 13 రోజులు బతికే ఈస్ట్.. సెలీనియంతో 21 రోజుల పాటు బతికిందని, దాని జీవితకాలం 62 శాతం పెరిగిందని తేల్చారు. దాన్ని నిర్ధారించేందుకు శిలీంద్రాల్లోని కణాలను పరీక్షించారు.


More Telugu News