ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వస్తున్న 'ఉప్పెన'

  • అందమైన ప్రేమకథగా అలరించిన 'ఉప్పెన'
  • ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్
  • మే 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్    
ఈ మధ్య కాలంలో తెలుగు తెరను పలకరించిన అందమైన ప్రేమకథా చిత్రాలలో 'ఉప్పెన' ముందువరుసలో నిలిచింది. సముద్ర తీరప్రాంతంలోని ఓ జాలరి గూడెం చుట్టూ తిరిగే ప్రేమకథ ఇది. సముద్రంపైనే ఆధిపత్యం చెలాయించాలనుకునే ఓ నాయకుడి కూతురు .. ఓ జాలరి కుర్రాడి ప్రేమలో పడుతుంది.

అయితే, ఆ ప్రేమను అంగీకరించని ఆ పిల్ల తండ్రి ఏం చేశాడు? పర్యవసానాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. ప్రేమకథలకు పసందైన పాటలే పెద్ద దిక్కు. కొత్త అవకాయ పచ్చడిలాంటి ఈ కథలో పాటలు పాయసంలా తగులుతాయి. సాధారణంగా 'ఉప్పెన' వస్తే ఆస్తులు కొట్టుకుపోతాయి. కానీ ఈ 'ఉప్పెన'కి కోట్ల రూపాయలు కొట్టుకురావడం విశేషం.  

బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ - కృతి శెట్టి నాయకా నాయికలుగా నటించారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేసింది. థియేటర్లను దడదడలాడించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి సిద్ధమవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. మే 14వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఇక ఓటీటీలో ఈ సినిమా రేంజ్ లో దూసుకుపోతుందో చూడాలి.


More Telugu News