వాటా కోసం వెంచర్‌ ఓనర్‌ని బెదిరించినట్లు మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు.. కొట్టిపారేసిన మంత్రి

  • రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఆడియో
  • వెంచర్‌ ఓనర్‌ని మంత్రి బెదిరిస్తున్నట్లు ఉన్న రికార్డింగ్‌
  • ఈ విషయం కేసీఆర్‌ దృష్టికి రాలేదా అని రేవంత్‌రెడ్డి ప్రశ్న
  • అది తన గొంతు కాదన్న మల్లారెడ్డి
  • ఏ విచారణకైనా సిద్ధమన్న మంత్రి
ఓ వెంచర్‌లో వాటా కావాలంటూ తెలంగాణ మంత్రి మల్లారెడ్డి డిమాండ్‌ చేస్తున్నట్లు ఉన్న ఆడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.  వెంచర్‌ వేసిన రియల్టర్‌కు చెందిన మధ్యవర్తితో మల్లారెడ్డి మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

‘వెంచర్‌కు సంబంధించిన వ్యవహారంలో సర్పంచ్‌కి ఇస్తే సరిపోతుందా.. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే ఉన్నారం’టూ మల్లారెడ్డి బెదిరించినట్లుగా చెబుతున్న ఆడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. మల్లారెడ్డి బెదిరింపుల సంగతి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. మంత్రిని ‘వసూల్‌ రాజా’గా పేర్కొన్న రేవంత్‌ ఆయనపై వేటు వెయ్యరా? అని సీఎంని నిలదీశారు.

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణల్ని మంత్రి మల్లారెడ్డి కొట్టిపారేశారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను ఏ వెంచర్‌ ఓనర్‌తోనూ మాట్లాడలేదని తెలిపారు. ఆ ఆడియో రికార్డింగ్‌లో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు. ఏ వెంచర్‌ ఓనర్‌ తన ఇంటికి రాలేదన్నారు. దీనిపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు.


More Telugu News