ఇప్పపువ్వు సేకరణకు అడవిలోకి వెళ్లిన ఇద్దరిని బలిగొన్న పులి

  • మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఘటన
  • ఇప్పపువ్వు సేకరిస్తుండగా హఠాత్తుగా దాడిచేసిన పులి
  • భయంతో పరుగులు తీసిన మిగతా వారు
అడవిలో ఇప్పపువ్వు సేకరణకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు పులి పంజాకు బలయ్యారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో నిన్న జరిగిందీ ఘటన. మద్య నిషేధం అమల్లో ఉండడంతో సారా తయారీలో ఉపయోగించే ఇప్ప పువ్వుకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పపువ్వు ఏరేందుకు సిందేవాహి తాలూకాలోని పవన్‌పార్ గ్రామానికి చెందిన కమలాకర్ (65) తన సోదరుడి కుమారుడు దుర్వాస్ (48), మరికొందరు కలిసి ఖైరీ గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లారు.

పువ్వు సేకరిస్తున్న సమయంలో పులి వారిపై హఠాత్తుగా దాడిచేసింది. పులి దాడిలో తొలుత కమలాకర్ ప్రాణాలు కోల్పోయాడు. దానిని కర్రతో అదిలించి తరిమివేసేందుకు ప్రయత్నించిన దుర్వాస్‌పైనా దాడిచేసిన పులి అతడిని కూడా చంపేసింది. దీంతో మిగతావారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కాగా, పులి దాడి చేయడం ఈ వారంలో ఇది మూడోసారని గ్రామస్థులు తెలిపారు.


More Telugu News