'వకీల్ సాబ్' విషయంలో క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు 

  • ఓటీటీలో 'వకీల్ సాబ్' అంటూ ప్రచారం
  • పుకార్లపై స్పందించిన దిల్ రాజు
  • వీడియో రూపంలో ఇచ్చిన స్పష్టత

పవన్ కల్యాణ్ - 'దిల్' రాజు కాంబినేషన్లో తొలి చిత్రంగా నిర్మితమైన 'వకీల్ సాబ్' .. ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రుతి హాసన్ ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, నివేద థామస్ .. అంజలి .. అనన్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. చాలా గ్యాప్ తరువాత పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడం .. బలమైన కథాకథనాలు .. ఈ సినిమా ఈ స్థాయిలో దూసుకుపోవడానికి కారణాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దాంతో ఈ విషయంపై నిర్మాత 'దిల్'రాజు స్పందిస్తూ ఒక వీడియో వదిలారు. "తెలుగువారందరికీ 'ప్లవ'నామ ఉగాది శుభాకాంక్షలు. 'వకీల్ సాబ్'ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 'వకీల్ సాబ్' ఓటీటీలో వచ్చేస్తోందనే చిన్న రూమర్ రన్ అవుతోంది. పెద్ద స్టార్ సినిమా ఏదైనా 50 రోజుల తరువాతనే ఓటీటీలో వస్తుంది. అలాగే 'వకీల్ సాబ్' కూడా 50 రోజుల తరువాతనే ఓటీటీలో వస్తుంది.


ఒక పెద్ద సినిమాను థియేటర్లలో చూసేటప్పుడు కలిగే అనుభూతి, టీవీలలో .. ఫోన్లలో చూడటం వలన కలగదు. అందరూ కూడా సాధ్యమైనంత వరకూ థియేటర్లలోనే చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ కోవిడ్ కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను చూడండి. చూసినవాళ్లు అభినందిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా మంచి సినిమాలను అందించడానికి అవసరమైన ఉత్సాహాన్ని 'వకీల్ సాబ్' నాకు ఇచ్చింది .. అందరికీ మరోసారి ధన్యవాదాలు " అంటూ చెప్పుకొచ్చారు.


More Telugu News