'పైథాన్-5' మిస్సైల్ తో మరింత శత్రుభీకరంగా మారిన మన 'తేజస్'!

  • ఐదోతరం పైథాన్ మిస్సైల్ ను అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సంస్థ
  • తేజస్ కు మరింత బలం చేకూర్చనున్న పైథాన్-5
  • ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లలో అగ్రగామిగా గుర్తింపు
  • నిన్న ప్రయోగించిన డీఆర్డీవో
భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి పోరాట విమానం తేజస్ ఇప్పుడు మరింత శక్తిమంతమైంది. ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్సీయే తేజస్)కు ఐదో తరం పైథాన్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ను అమర్చారు. పైథాన్-5 క్షిపణిని గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపైకి ప్రయోగించే వీలుంటుంది. ఈ 5వ తరం పైథాన్ మిస్సైల్ అమర్చిన తేజస్ యుద్ధ విమానం నిన్న విజయవంతంగా పరీక్షలు నిర్వహించింది. తేజస్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లిన పైథాన్-5 నిర్దేశించిన లక్ష్యాన్ని గురితప్పకుండా తాకిందని డీఆర్డీవో వెల్లడించింది. ఈ అత్యాధునిక క్షిపణి కారణంగా... తేజస్ యుద్ధ విమానం దూరం నుంచే శత్రువుపై దాడి చేసే వీలుంటుంది.

పైథాన్-5 మిస్సైల్ ను ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని రేంజి 20 కిలోమీటర్లు కాగా, మాక్ 4 వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి దీన్ని టార్గెట్ కు లాక్ చేస్తే దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దీంట్లో అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్, ఇమేజ్ ఇన్ ఫ్రారెడ్ వ్యవస్థలను అమర్చారు. తద్వారా లక్ష్యాలను సులువుగా గుర్తించి, విధ్వంసం సృష్టించగలదు.


More Telugu News