వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్?

  • నిరాశపరిచిన 'చెక్' .. 'రంగ్ దే'
  • షూటింగ్ దశలో 'అంధాదున్' రీమేక్
  • పక్కకి వెళ్లిపోయిన 'పవర్ పేట'  

యువ కథానాయకులలో నితిన్ మంచి జోరుమీదున్నాడు. వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.  'భీష్మ' సినిమా తరువాత ఆయన చేసిన 'చెక్' ... 'రంగ్ దే' ఆశించినస్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం మాత్రం ఆయన 'అంధాదున్' రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత .. పాటల రచయిత చైతన్య కృష్ణ దర్శకత్వంలో 'పవర్ పేట' సినిమాలో ఆయన చేయవలసి ఉంది. కానీ ఇప్పుడు నితిన్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'చెక్' .. 'రంగ్ దే' అందించిన ఫలితాలే అందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది.


మరి 'అంధాదున్' రీమేక్ తరువాత నితిన్ ఏ దర్శకుడితో చేయనున్నాడనే ప్రశ్నకి సమాధానంగా, వక్కంతం వంశీ పేరు వినిపిస్తోంది. వక్కంతం వంశీ ఇటీవల వినిపించిన కథ నచ్చడంతో, ముందుగా ఆయన ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే నిర్ణయానికి నితిన్ వచ్చాడని అంటున్నారు. రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరు ఉంది. ఆయన కథలను అందించిన సినిమాలు కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి. అయితే దర్శకుడిగా తెరకెక్కించిన 'నా పేరు సూర్య' మాత్రం నిరాశపరిచింది. ఆ తరువాత దర్శకుడిగా ఆయన పేరు నితిన్ సినిమాకే వినిపిస్తోంది మరి!



More Telugu News